ఉక్రెయిన్, రష్యా విషయంలో భారత్ తను అనుసరిస్తున్న వైఖరిపై ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ కు భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఐక్యరాజ్యసమితి ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండాల్సింది కాదంటూ యూఎన్ఓ డచ్ శాశ్వత రాయబారి కారెల్ వాన్ ఊస్తరమ్ ట్వీట్ చేశారు. దానికి బదులిచ్చిన భారత శాశ్వత రాయబారి టి.ఎస్. తిరుమూర్తి.. నెదర్లాండ్స్ రాయబారి నోరు మూయించారు. ‘‘మాకు మీరు నీతులు చెప్పొద్దు. ఏం చేయాలో మాకు తెలుసు’’ అంటూ ఘాటు జవాబు ఇచ్చారు.
ఇదిలావుంటే ఐరాస భద్రతా మండలిలో ఇవాళ ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి.. యుద్ధాన్ని ఆపేందుకే భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలంటూ చెబుతూనే ఉన్నామన్నారు. బూచాలో నరమేధాన్ని ఖండించామని గుర్తు చేశారు. శాంతి సామరస్యాలకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. యుద్ధంలో విజేతలెవరూ లేరన్నారు.
యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ రష్యా, ఉక్రెయిన్ పర్యటనలను స్వాగతిస్తున్నామని తిరుమూర్తి అన్నారు. యుద్ధం మూలంగా ఎన్నో పేద దేశాలు తిండి గింజలు అందక అల్లాడుతున్నాయని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ కు, తమ చుట్టుపక్కల ఉన్న దేశాలకూ మానవతా సంక్షోభ సాయాన్ని పంపిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. తిండి గింజలు, ఔషధాలు తదితరాలను అందిస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రపంచం యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని, ఒకరి భౌగోళిక సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించాలని అన్నారు. ఆ ప్రసంగం కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో డచ్ రాయబారి రిప్లై ఇచ్చారు. దానికి తిరుమూర్తి కౌంటర్ ఇచ్చారు.