పార్టీ గెలుపుకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దృఢ సంకల్పతంతో ముందుకు సాగాలని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీకి ఏ మంత్రదండం అవసరం లేదని, పార్టీ శ్రేణులు దృఢ సంకల్పతంతో ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. పార్టీ పునర్నిర్మాణం దిశగా ఈ నెల 13 నుంచి ఉదయ్‌పూర్ వేదికగా జరగనున్న చింతన్ శిబిర్ సన్నాహకాలపై సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రసంగించిన సోనియా గాంధీ పార్టీ పునరుజ్జీవానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికీ మేలు చేసిందని చెప్పిన సోనియా... ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ దిశగా పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఫలితాలు వాటంతటవే వస్తాయని ఆమె చెప్పారు. పార్టీ వేదికలపై నేతలకు సంబంధించి స్వీయ విమర్శలు ఇవసరమన్న సోనియా..అయితే ఆ విమర్శలు నేతలను నొప్పించేవిగా ఉండరాదని సూచించారు. చింతన్ శిబిర్‌ను ఏదో సంప్రదాయమైన సమావేశంగా పరిగణించరాదన్న సోనియా... పార్టీ పునరుజ్జీవం దిశగా జరిగే కీలక భేటీగా గుర్తించాలని సూచించారు.