ఏపీలో 'అసని' తుపాను అలజడి రేపుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో గుబులు పుట్టిస్తోంది. తీరానికి తుపాను దగ్గరగా వస్తున్న క్రమంలో అలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తీవ్ర తుపానుగా మారి గంటకు 25 కి.మీ. వేగంతో దూసుకొస్తోంది. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నట్లు కురుస్తాయని అంచనా వేసింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, గురువారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఇప్పటికే విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.
ఏపీకి అసని తుపాన్ ప్రభావం తక్కువేనని తెలుస్తోంది. విశాఖకు 450 కి.మీ.దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది తీరాన్ని తాకే అవకాశం లేదని, అయితే తీరానికి సమాంతరంగా పయనిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.