లౌడ్ స్పీకర్ల తొలగింపు విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆథిత్యనాథ్ సర్కార్ దూకుడును ప్రదర్శిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో అక్రమంగా కొనసాగుతున్న లౌడ్ స్పీకర్లపై యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రెండు వారాల్లోనే భిన్న మత వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాల నుంచి అనుమతుల్లేని 64,128 లౌడ్ స్పీకర్లను తొలగించారు. అదే సమయంలో 57,352 లౌడ్ స్పీకర్ల వ్యాల్యూమ్ ను తగ్గించారు.
లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసిన చోట.. వాటి నుంచి వచ్చే శబ్దం అక్కడి ఆవరణ దాటి వినపడకూడదంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాంతి, సామరస్యతను కాపాడతామని కార్యక్రమాల నిర్వాహకుల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అత్యధికంగా బరేలీ ప్రాంతం నుంచి 17,287 లౌడ్ స్పీకర్లు తొలగించారు. ఆ తర్వాత మీరట్ నుంచి 11,769 లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అనధికారికంగా నడుస్తున్న లౌడ్ స్పీకర్లను తొలగించేంత వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు.