హనుమాన్ ఛాలీసా వివాదం నేపథ్యంలో అరెస్టై.. పది రోజుల పాటు జైలు జీవితం గడిపి ఎట్టకేలకు బెయిల్‌పై ఇటీవలే విడుదలైన అమరావతి ఎంపీ నవీనత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాల బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం నాడు ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు నిర్దేశించిన నిబంధనలను కౌర్ దంపతులు ఉల్లంఘించారని, ఈ కారణంగానే వారి బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును కోరారు.
హనుమాన్ జయంతి నాడు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ ఛాలీసాను పఠించాలని డిమాండ్ చేసిన కౌర్ దంపతులు... సీఎం పఠించని పక్షంలో హనుమాన్ ఛాలీసాను ఆయన ఇంటి ముందు తామే పఠిస్తామంటూ ప్రకటించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన శ్రేణులు కౌర్ దంపతుల ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ముంబైలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా... జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.