చైనాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. చాంగ్ కింగ్ జియాంగ్ బీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన టీవీ 9833 అనే విమానం అగ్ని ప్రమాదానికి గురైంది. విమానం టిబెట్ లోని న్యింగ్చికి వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయ్యేందుకు రన్ వే నుంచి ప్రారంభమైన కాసేపటికే విమాన రెక్క భాగం నుంచి మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని నిలిపేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులను సేఫ్ గా దించారు. ప్రమాద సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులతో పాటు 9 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.