చాలా మంది జిమ్‌లో వ్యాయామం చేస్తుంటారు. ఈ క్రమంలో రెడీమేడ్ ఇన్‌స్టంట్ ఎనర్జీ డ్రింక్‌లపై ఎనలేని మక్కువ చూపుతుంటారు. అయితే అవి శరీరానికి ఎంతో చేటు చేస్తాయి. వాటికి బదులు బీట్‌రూట్, దానిమ్మ జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎంతో శక్తిని వెంటనే శరీరానికి చేకూర్చుతుంది. ఇందులో అలసిని శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, బీ6, విటమిన్ సి, విటమిన్ కె మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు తగిన స్థాయిలో ఉంటాయి.
ఈ జ్యూస్‌లో నైట్రేట్ తగుమోతాదులో ఉంటుంది. ఇది వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది. ఈ కారనంగా మెరుగైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో శక్తిని పెంచుతుంది. తద్వారా వ్యాయామం సులభతరం అవుతుంది. గుండెనాళ వ్యవస్థకు అవసరమైన ఆక్సిజన్ మొత్తాన్ని అందిస్తుంది. అల్పాహారానికి ముందు లేదా తర్వాత, వ్యాయామ సెషన్‌కు ముందు, సమయంలో లేదా తర్వాత ఈ జ్యూస్‌ను తాగొచ్చు.