బలహీనమైన వైద్య వ్యవస్థే ఉత్తర కొరియా దేశానికి ఇపుడు సవాల్ గా మారుతోంది. ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ ముందు ఇప్పుడు అతిపెద్ద సవాల్ వచ్చి పడింది. గత రెండేళ్లుగా కరోనా ఆ దేశానికి చేరలేదన్న అభిప్రాయం ఉంది. వాస్తవం బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంచడంలో ఉత్తర కొరియా ముందుంటుంది. కానీ, ఇటీవల మొదటిసారి కరోనా కేసు నమోదైనట్లు ఆ దేశమే ఒప్పుకుంది. ఈ క్రమంలో కిమ్ జాంగ్ ఉన్ సైతం ముఖానికి మాస్క్ తో దర్శనమిచ్చారు.
కరోనా మహమ్మారి నియంత్రణపై ఆయన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖానికి మాస్క్ పెట్టుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. కరోనా వెలుగు చూడడం ఆలస్యం.. ఆయన యావత్ దేశాన్ని లాక్ చేసేయాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా వైరస్ విస్తరించకుండా చూడాలన్నది ఆయన అభిమతం. కానీ, జ్వరం తదితర లక్షణాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. ఆరుగురు మరణించారు. వీరంతా కరోనా వైరస్ బాధితులే అయితే అక్కడ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.
ఉత్తర కొరియాలో కరోనా వైరస్ తీవ్రతపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఇది ఆ దేశంపై గట్టి ప్రభావాన్నే చూపించనుందని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అక్కడ వైద్య సదుపాయాలు చాలా బలహీనం. 2.6 కోట్ల మంది ప్రజలకు టీకాలు వేయలేదు. జ్వరం లక్షణాలతో బాధపడుతున్న నమూనాలను పరీక్షించగా ఒమిక్రాన్ వేరియంట్ అని తెలిసినట్టు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సైతం ప్రకటించింది.