ఢిల్లీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోయిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం సంభవించింది. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. భవనం వెనుక పార్కింగ్ ప్రాంతంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఆసుపత్రిలోని ఎక్స్-రే విభాగానికి వ్యాపించాయి. భవనంలోని వివిధ వార్డుల్లో చేరిన రోగులు హాహాకారాలు చేశారు. దట్టంగా అలముకున్న పొగ, మంటలతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి ఉద్యోగులు, రోగుల సహాయకులు స్పందించి, వారిని ఇతర వార్డులకు తరలిస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకున్నారు. 40 నిమిషాల్లో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మూడు భవనాలు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టంకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నెఫ్రాలజీకి సంబంధించిన ఆరు వార్డులు, రెండు డెర్మటాలజీ వార్డులు, మూడు సర్జికల్ వార్డులను ఖాళీ చేశారు. రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారు.