రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల మద్దతు లభిస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణమే చొరవ చూపుతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఇక ప్యాకప్ అనేశారు.. పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులకు సిద్దమవుతున్నారని విమర్శించారు. అవన్నీ పొలిటికల్ ఫిలాసఫీ లేని పార్టీలు అన్నారు. పొలిటికల్ ఫిలాసఫీతో సీఎం వైయస్ జగన్ ఉన్నారు… అందుకే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపిస్తున్నారని తెలిపారు.
పిల్లల విద్యా కోసం నాడు నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి.. ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారని.. కానీ, గతంలో జన్మ భూమి కమిటీలు ఇచ్చినదే ఫైనల్ లిస్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.