దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ కోసం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆ పార్టీ మేథోమదన సదస్సు 'చింతన్ శిబిర్' నిర్వహిస్తోంది. ఇందులో ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ సహా పార్టీ కీలక నేతలంతా పాదయాత్రలు చేపట్టాలను నిర్ణయించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు నిర్వహించాలని సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా పార్టీలో అసమ్మతి వర్గం జీ23 నాయకుల ప్రధాన డిమాండ్ నెరవేరింది. పార్టీ పార్లమెంటరీ బోర్డును పునరుద్ధరించింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వచ్చే ఏడాది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించనున్నారని, అందులో ఎక్కువ భాగం ‘పాదయాత్ర’ అని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని చింతన్ శిబిర్‌లో నిర్ణయించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో సహా బలహీన వర్గాలకు పార్టీలోని అన్ని స్థాయిలలో 50 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందన్న సందేశాన్ని పునరుద్ఘాటించేందుకు సంస్థాగత సంస్కరణలు అవసరమని కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, కె రాజు మీడియాతో అన్నారు. వీటిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్యానెల్ సిఫార్సులను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పరిశీలిస్తుంది. ఇప్పటికే మొదటి రోజున, 'ఒక కుటుంబం, ఒకే టిక్కెట్ నియమం' అని పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేయాలనుకునే వారికి కనీసం 5 సంవత్సరాల పాటు పార్టీలో అనుభవం ఉండాలని తీర్మానించారు.