మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా ఖచ్చితంగా మారాల్సిందే. ఈ క్రమంలో మన ఆరోగ్యాన్ని,అందాన్ని పట్టించుకునే సమయమే ఉండటం లేదని కొందరు బాధపడుతున్నారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉన్నట్టు ముఖ సౌందర్యం కూడా మన చేతుల్లోనే ఉంది. పార్లర్ల చుట్టూ తిరుగుతూ వందలకొద్దీ డబ్బును వేస్ట్ చెయ్యకుండా, చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మన ముఖానికి కొత్త కళను తీసుకురావచ్చు.
రోజంతా మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. తద్వారా మన ముఖంపై దుమ్ము, ధూళి పేరుకుపోతుంటుంది. ముఖ అలసట తీరాలన్నా, ముఖం పై పేరుకున్న మురికి, జిడ్డు తొలగాలన్నా రోజూ రాత్రిపూట పడుకునేముందు ముఖాన్ని శుభ్రం చెయ్యాలి. దుమ్ము, ధూళి లేని వాతావరణంలో గడిపినా కానీ పడుకునే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవడం మాత్రం తప్పనిసరి అని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ఇంకా రోజంతా మేకప్ వేసుకునో, లేక ఏదైనా క్రీం రాసుకుని చర్మంపై ఉన్న రంధ్రాలను మూసివేస్తుంటాం. ఇవాన్నీ పోవాలంటే ముఖం కడగాల్సిందే. మృతకణాలు పోయి, ముఖం కొత్తకాంతిని సంతరించుకోవాలంటే, రోజూ రాత్రి పూట ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు తరచూ వాడే సబ్బుతోనైనా, లేక పేస్ వాషర్ తో నైనా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆపై మాయిశ్చరైజర్ రాసుకుంటే సరి. టైం వేస్ట్ అనుకోకుండా ఇలా రోజుకొక పది నిముషాలు మనకోసం కేటాయించుకుంటే, ఆ తర్వాత బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగే సమయం, ఇంకా డబ్బు కూడా ఆదానే.