కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. కరోనా బారిన పడి ఎంతో మంది మరణించారు. ప్రజల జీవితాల్లో కరోనా ఎన్నో విషాదాలను, బాధలను మిగిల్చింది. అయితే ఓ మహిళ మాత్రం కరోనా నేర్పిన గుణపాఠం నుంచి ఆత్మవిశ్వాసం పెంచుకున్నానంటోంది. ఆమెనే కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల మౌతుషి బసు. ఆమె కరోనా కంటే ముందు పానసోనిక్ లో జాబ్ చేసేది. కరోనా కారణంగా జాబ్ పోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఉబెర్ బైక్ రైడర్ గా మారింది. ఈ విషయాన్ని రచయిత రణవీర్ భట్టాచార్య లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. కోల్‌కతాలో తాను బయటకు వెళ్లేందుకు ఉబెర్ బైక్‌ను బుక్ చేస్తే మౌతుషి బసు వచ్చారని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.
భారీ వర్షం కురుస్తున్నా ఆ మహిళ బండిని చాలా జాగ్రత్తగా నడిపారని రణవీర్ చెప్పారు. ఆమె అదనంగా డబ్బులు ఏమీ అడగలేదని తెలిపారు. గతంలో బండి నడిపిన అనుభవం లేకపోయినా ఆమె కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం లేక ఈ పనిచేస్తున్నట్లు చెప్పారని తెలిపారు. బసు కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.