పచ్చిమ ప్రకాశం ప్రాంతంలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని ముసలివారి వరకు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురిచేస్తుంది. గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం పట్టణం లో ఇప్పుడు యువత గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు.
తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థుల నుంచి డిగ్రీ చదివే విద్యార్థుల వరకు అధిక మొత్తంలో గంజాయికి బానిస అయ్యారు. కంభం పట్టణంలోని గవర్నమెంట్ కాలేజ్ మైదానంలో ఉన్న ఒక పాత భవనంతో పాటు కంభం పరిసర ప్రాంతాల శివార్లను నిర్మానుష్య ప్రదేశాలను కేంద్రాలుగా చేసుకొని విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారు.
కంభం పట్టణం లోని సాయిబాబా స్ట్రీట్, శీలం వీధి, రంగరాజు స్కూల్ పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయదారులు గంజాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు ఏమి చేస్తున్నారో అని ప్రజలు ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి.
గంజాయికి బానిసైన వారిలో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో విద్యార్థులు 400 మందికి పైగా గంజాయి సేవిస్తున్నారు అంటే మీరే అర్థం చేసుకోదు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో. మరి ఈ గంజాయి సంస్కృతిపై పోలీసులు ఏ విధంగా చెక్ పెడతారో వేచిచూడాల్సిందే.