అమెరికాలో ప్రతిసారి జాతి విద్వేషం పడగ విప్పితూనే ఉంది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సైనికుడు వేషదారణలో ప్రవేశించిన 18 ఏళ్ల వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఇది జరిగింది.
అయితే కాల్పులు జరిపిన వ్యక్తి తుపాకిని జారవిడిచి పోలీసులకు లొంగిపోయే ముందు కాల్పుకుంటానని బెదిరించాడని అధికారులు తెలిపారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే చనిపోయిన వారిలో ఎక్కువమంది ఆఫ్రికన్ అమెరికన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. నలుగురు స్టోర్ ఉద్యోగులు, మిగిలిన వారు కస్టమర్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ సూపర్ మార్కెట్ బఫెలో డౌన్‌టౌన్‌కు ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రధానంగా నల్లజాతీయులు ఉండే పరిసరాల్లోనే ఉంది.
నిందితుడిని అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేపట్టారు. కాల్పుల ఘటనకు జాతి విద్వేషమే కారణంగా భావిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. నిందితుడు న్యూయార్క్ రాష్ట్ర కమ్యూనిటీకి చెందిన కాంక్లిన్‌కు చెందిన పేటన్ జెండ్రాన్ (18)గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో రద్దీగా ఉండే సమయంలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో 16 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో ఉదయం 8.30 గంటలకు పేలుళ్లు జరిగాయి.