సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఎత్తి వేసింది. దీనిపై బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయనను తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసులో ఉన్నట్లు ఆదేశాలలో ప్రభుత్వం పేర్కొంది. అయితే తదుపరి ఉత్తర్వులు అందించేలోపు జీఏడీకి రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావుకు సూచించింది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని వస్తువుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ ఏబీవీపై ఏపీ సర్కారు 2020 ఫిబ్రవరి 8న వేటు వేసింది. అవినీతి ఆరోపణల పేరుతో విధుల్లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఫిబ్రవరి 7, 2022తో ముగిసిందని, ఆ తర్వాత సస్పెన్షన్ చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు తర్వాత ఇప్పటి వరకు రెండు సార్లు ఏపీ చీఫ్ సెక్రటరీని ఆయన కలిశారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆయన సస్పెన్షన్‌ను కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది.