శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని వీరాపురం గ్రామ పాడి రైతులకు పశువైద్యం అందకుండా పోతోంది. మండల కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీలోని గ్రామాలకు పశువైద్యం అందని ద్రాక్షగా మారింది. పంచాయతీ కేంద్రంలో పశువైద్య ఉపకేంద్రం ఉన్నా అందులో పనిచేస్తున్న వైద్యులు అందుబాటులో ఉండటం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. దాంతో వీరాపురం గ్రామంతో పాటు వెంకటాపురం, హుసేన్పురం, భూవనముద్రం, లక్ష్మీపురం, దాదిరెడ్డిపల్లి, దాదిరెడ్డిపల్లి తండా గ్రామాలకు చెందిన మూగజీవాలకు వైద్యం కోసం కర్ణాటకకు వెళ్లకతప్పడం లేదని తెలిపారు.
ఇక్కడ పనిచేసే వైద్యులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని, ఆయనకు వీలున్నప్పుడు వచ్చి చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారని వాపోయారు. దీంతో గొర్రెలు, మేకలు, పాడి ఆవులకు జబ్బులు వస్తే ప్రైవేటు డాక్టర్లను ఆశ్రయించక తప్పడం లేదన్నారు. అంతేకాకుండా వీరాపురం వలస పక్ష లకు విడిది కేంద్రం. సాధారణంగా ఇప్పుడు వీచే ఈదురుగాలులకు చెట్లపై నుంచి పక్షులు కింద పడి మృత్యువాత పడటం, కొన్ని గాయాలపాలవడం జరుగుతోంది. ఈ సమయంలో అక్కడ పశువైద్యులు ఉండి వాటికి చికిత్సలు అందించాల్సి ఉంది. కానీ ఇలా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని గ్రామస్ధులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.