ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన యూపీలోని గ్రేటర్ నోయిడా దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది.
ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ యువతులు సొంత అన్నా చెల్లెళ్ల కుమార్తెలు. ఒకరు గ్రేటర్ నోయిడాలోని గ్రామంలో, మరొకరు ఢిల్లీలో ఉంటారు. కొద్ది రోజలు క్రితం గ్రేటర్ నోయిడా గ్రామంలోని యువతి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. అదే రోజు ఢిల్లీలోని మరో యువతి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
వారు కూడా పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులతో గ్రేటర్ నోయిడా, ఢిల్లీ పోలుసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఇంట్లో తనిఖీలు చేస్తుండగా వారిద్దరూ కనిపించారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, కలిసే జీవిస్తామని ఆ యువతులు పోలీసులకు చెప్పారు. కుటుంబసభ్యులు ఎంత నచ్చజెప్పినా యువతులిద్దరూ వినలేదు. దీంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.