మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ లో రాకేశ్ సురానా అనే ఆభరణాల వ్యాపారి తన రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు తన ఆస్తులను రాసిచ్చారు. తన భార్య లీనా సురానా, కుమారుడు అమయ్ సురానాతో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని ఆయన నిర్ణయించుకున్నారు. గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్ సురానా తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ స్థానికులు ఆయన కుటుంబాన్ని రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు.
డబ్బు సంపాదించి సుఖంగా ఉండటమే జీవితం కాదని, మనమేంటి అని గుర్తించడమే జీవిత పరమార్థం అని రాకేశ్ సురానా అంటున్నారు. తన భార్య కూడా చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకుందని, తన కుమారుడు కూడా నాలుగేళ్ల నుంచే ఇదే మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాడని రాకేశ్ సురానా తెలిపారు. రాకేశ్ భార్య లీనా సురానా మొదట అమెరికాలో చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో పై చదువులు పూర్తి చేశారు. 2017లో ఆమె తల్లి దీక్ష తీసుకున్నారు. కానీ క్యాన్సర్ వల్ల ఆ తర్వాత 7 రోజులకే ఆమె మృతిచెందారు. లీనా సోదరి నేహ కూడా 2008లోనే దీక్ష చేపట్టారు. ఇప్పుడు ఈ కుటుంబం మొత్తం మే 22న జైపుర్లో దీక్ష స్వీకరించనుంది.