నా క్లయింట్ ఆరోగ్య పరిస్థితికి సరిపడే ఆహారాన్ని అందించేలా చేయండి అని ఇటీవల అరెస్ట్ అయిన నవజ్యోత్ సింగ్ సిద్దూ తరఫు న్యాయవాది పటియాల కోర్టును ఆశ్రయించారు. ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారకుడయ్యాడన్న 1988 నాటి కేసులో పంజాబ్ రాజకీయనేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కోర్టు జైలు శిక్ష విధించడం తెలిసిందే. దీంతో ఆయన నిన్ననే కోర్టులో లొంగిపోవడంతో, పోలీసులు ఆయనను పాటియాలా జైలుకు తరలించారు.
ఇదిలావుంటే గతరాత్రి నుంచి సిద్ధూ ఎలాంటి ఆహారం తీసుకోలేదని ఆయన న్యాయవాది హెచ్ పీఎస్ వర్మ నేటి సాయంత్రం వెల్లడించారు. శుక్రవారం రాత్రి జైలు అధికారులు చపాతీలు ఇవ్వగా, తనకు గోధుమలు పడవని, అలెర్జీ ఉందని సిద్ధూ ఆహారం నిరాకరించినట్టు వర్మ తెలిపారు. తన క్లయింట్ సిద్ధూ ఆరోగ్య పరిస్థితికి సరిపడే ఆహారాన్ని అందించాలని జైలు అధికారులను ఆదేశించాలంటూ న్యాయవాది వర్మ పాటియాలా కోర్టును ఆశ్రయించారు.