విశాఖ పట్టణం మధురవాడలో పెళ్లి పీటలపై వధువు కుప్పకూలి చనిపోయిన ఘటనలో మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.వధువు పెళ్లి ఇష్టం లేక విషపదార్థాలు తిని మృతి చెందిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. సృజన ఇష్టంతోనే పెళ్లి నిర్ణయం జరిగిందని అన్నారు. అయితే పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృజనకు శివాజీతో పెళ్లి ఇష్టం లేదని, పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. సృజన ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చి చెప్పారు.సృజన గత ఏడేళ్లుగా పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని పోలీసుల విచారణలో తెలిసింది. సృజన మరణం తరువాత విచారణ మొదలు పెట్టిన పోలీసులు.. ఆమె ఫోన్ ను స్వాధీనంచేసుకొని పరిశీలించారు. అయితే సృజన ఫోన్ నుంచి కొన్ని నెంబర్లు, మెస్సేజ్ లు కుటుంబ సభ్యులు డిలిట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. కాగా పోలీసుల విచారణలో భాగంగా కాల్ డయల్ రికార్డర్ తో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తోకాడ మోహన్ అనే వ్యక్తితో సృజన ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో మోహన్ పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడు. సరియైన ఉద్యోగం చూసుకోగానే పెళ్లిచేసుకుంటానని సృజనకు హామీ ఇచ్చాడు. ఇంతలోనే కుటుంబ సభ్యులు సృజనకు పెళ్లి సంబంధం చూడటం, ముహూర్తాలు పెట్టుకోవటం చకచకా జరిగిపోయాయి.
ఈ క్రమంలో తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని, ఎలాగైనా తనను తీసుకుపోవాలని మోహన్ కు సూచించింది. రెండేళ్లు ఆగాలని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని, మంచి ఉద్యోగం రాగానే తీసుకెళ్తానని మోహన్ సృజనకు తెలిపాడు. పెళ్లికి మూడు రోజుల ముందు సృజన ప్రియుడితో ఇన్ స్టా గ్రామ్ లో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి సమయం దగ్గరకు రావడంతో పెళ్లిని ఎలాగైనా ఆపాలనుకున్న సృజన ఈనెల 11న పెళ్లిరోజు విష పదార్థం తీసుకుంది. సృజన ఆరోగ్యం క్షీణించడంతో పెళ్లి పీటలపైనే కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే ఇక్కడ సృజన కేవలం పెళ్లిని ఆపాలని భావించింది. కానీ తాను చేసిన పనితో ఊహించని రీతిలో ప్రాణాలను కోల్పోయిందని పోలీసులు విచారణలో తేల్చారు.