విత్తనాలు కొనేటప్పుడు రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొంత మంది రైతులు ప్రైవేటు దుకాణాల్లో విత్తనాలను కొంటుంటారు. తక్కువ ధరతో ఎక్కువ దిగుబడి వస్తుందని దుకాణ నిర్వాహకులు రైతులను నమ్మించి, విత్తనాలను అంటగడుతున్నారు. దీంతో అనేక చోట్ల నకిలీ విత్తనాల బారిన పడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయాధికారులు సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాటించావాల్సిన జాగ్రత్తలు..
- వ్యవసాయ శాఖ నుంచి అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలి.
- ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల నుంచి సర్టిఫైడ్ అయిన వాటినే ఎంచుకోవాలి.
- కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
- బిల్లుపై రైతు అడ్రస్, గడువు తేదీ, కంపెనీ పేరు లేబుల్, పరిమాణం, విత్తనం ధర, అమ్మిన వారి సంతకం వంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి.
- విత్తన బస్తాపై ముద్రించిన ధ్రువపత్రం బిల్లును రైతులు తమ పంట చేతికి వచ్చే వరకు భద్రపరుచుకోవాలి.
- సంచులపై విత్తన ఉత్పత్తి విక్రయదారుడి పేరు, అడ్రస్, లాట్ నెంబర్ ఉండాలి.
- విత్తనాలను కొన్న వెంటనే మొలక శాతం పరీక్షించుకోవాలి. కనీసం 75 % ఉంటేనే విత్తు విత్తుకోవాలి.
- విత్తన సంచులను రైతులు నమూనా వివరాల కోసం పంట కోతకు వచ్చేవరకు దాచుకోవాలి.