ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెం సమీపంలో ఓ యువకుడు చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు రాసిన చివరి లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లకు చెందిన గోపిరాజు వినుకొండలో పనులు చేసేవాడు. తాను సొంతూరు వెళ్తున్నానని స్నేహితులతో చెప్పి బయల్దేరాడు. పట్టణం దాటిన తర్వాత ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను ఓ లేఖ రాశాడు. ముందుగా తన మృతదేహాన్ని తన అన్నకు అప్పగించాలని ఫోన్ నంబర్ రాశాడు. అనంతరం ప్రేయసిని సంబోధిస్తూ కవిత్వం రాశాడు ‘ఏ అమ్మాయి.. నువ్వే గెలిచావు.. నేనే ఓడిపోయా.. నేను ఏ తప్పూ చేయలేదు.. నేను ఎప్పుడూ ఓడిపోలా.. ఇప్పుడే ఓడిపోయా.. ఈ జన్మకు నీవే నా భార్య అని ఊహించుకున్నా.. కానీ నాకు ఆ అదృష్టం లేదు.. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా.. మర్చిపోవాలంటే ముందు చచ్చిపోవాలి.. ఐ మిస్ యూ.. లైఫ్ లో ఎప్పుడూ కనిపించను.. నా చావుకు నేనే కారణం’ అని ఆ యువకుడు లేఖ ముగించాడు. ఈ లేఖ చదివిన వారు ప్రేమ కోసం ప్రాణం తీసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.