ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం వెలిగిపోతోందంటూ... కరోనా సమయంలో 44సార్లు ఇంటింటి సర్వేలు చేసి సేవలు చేశామంటూ దావోస్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు చెప్పిన విషయాలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు అని జనసేన నాయకులూ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం జగన్ దావోస్ పర్యటన మీద స్పందిస్తూ.... విదేశీయులకు ఏం చెప్పినా నిజాలు తెలియవు అనే ధీమాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ కూడా అందించలేకపోయారు... ప్రాణవాయువు అందకే తిరుపతి రుయా ఆసుపత్రిలో 30మంది చనిపోయారనేది వాస్తవం. ఫస్ట్ వేవ్ కరోనా సమయంలో ఆసుపత్రులకు కనీసం మాస్కులు, గ్లవుజులు కూడా ఇవ్వలేకపోయారు. ఆ విషయం గురించి ప్రశ్నించినందుకే డా.సుధాకర్ గారిని వేధించి, కేసులు పెట్టి, నడరోడ్డుపై ఎలా బాధపెట్టారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంబులెన్సులు ఉండవు, ఆసుపత్రిలో చనిపోతే కనీసం మృతదేహాన్ని తరలించే వాహనం ఇవ్వరు.. ఇక వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వైద్య ఆరోగ్య సేవలు ఏమిటి? రుయా ఆసుపత్రిలో పసిబిడ్డ మృతదేహాన్ని ఓ పేద తండ్రి బైక్ మీద తీసుకువెళ్లిన ఘటనను, ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు కుట్లు వేసి, కట్లు కట్టిన సంగతినీ కూడా దావోస్ వేదికగా చెప్పాల్సింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు నిధులు కరోనాను ఎదుర్కొనేందుకే ప్రత్యేకంగా ఇచ్చింది. వాటిని ఏం చేశారు? కరోనా సమయంలో ఎంతో మంది స్పందించి విరాళాలు ఇచ్చారు. అవి ఏమైపోయాయి? 2020, 2021లో ఆసుపత్రులకు భోజనం సరఫరా చేసినవారికి బిల్లులు కూడా ఇవ్వలేదనేది వాస్తవం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందు, ఉపకరణాలు సరఫరాకు ఎన్ని సార్లు టెండర్లు పిలిచినా ఎందుకు రావడం లేదో కూడా శ్రీ జగన్ రెడ్డి గారు దావోస్ వేదికగా వివరిస్తే బాగుండేది. కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం రూ.11 వందల కోట్లను మళ్లించేశారు. ఇలాంటి నిజాలు ప్రజలకు తెలుసు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ.) ఆకర్షించడంలో విఫలమైన విషయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక స్పష్టంగా చెబుతోంది. 2021-22లో దేశానికి వచ్చిన ఎఫ్.డి.ఐ.ల్లో కేవలం 0.38% మాత్రమే ఏపీ సాధించగలిగింది. ఇక్కడ ఉన్న ఆర్ధిక అరాచకం, పీపీఏల రద్దు, అధికార పార్టీ నేతలు పారిశ్రామికవేత్తలను ఇబ్బందిపెట్టడం, ప్రభుత్వ విధానాల మూలంగానే ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. విశాఖ నుంచి వెళ్ళిపోయిన లులూ సంస్థ ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులుపెడుతోంది. అనేక విదేశీ సంస్థలు ఏపీకి ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్న మాట వాస్తవం. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను, అభివృద్ధిని విస్మరించి ఆర్థిక అరాచకానికి పాల్పడితే పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి? వీటన్నింటిని విస్మరించి దావోస్ లో ఎన్ని అవాస్తవాలు చెప్పినా ప్రయోజనం ఉండదు అని ఆయన అన్నారు.