ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఉద్యోగులు కోరుతున్నట్లు పాత పెన్షన్ విధానం అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. ఏపీలోని 16 మంది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌తో పాటు సజ్జల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇవ్వడం కుదరదని చెప్పారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగులకు వైఎస్ జగన్ సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఓపీఎస్ అమలు చేస్తే ఎంత భారం ఉంటుందో అప్పట్లో అంచనా వేయలేకపోయామన్నారు.
ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయకపోయినా, జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్) అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. అయితే ఏపీ కంటే తక్కువ ఆదాయం ఉన్న చత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఓపీఎస్ అమలు చేస్తున్న విషయాన్ని ఆయన వద్ద మీడియా ప్రస్తావించింది. దీనికి బదులిస్తూ అక్కడి ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం చేపట్టారని, ఏపీలో ఉద్యోగులకు అండగా సీఎం జగన్ నిలుస్తున్నారని చెప్పారు. జీపీఎస్ అమలు చేయడం కూడా ప్రస్తుతం భారమని, అయినా ఉద్యోగులకు మెరుగైన బెనిఫిట్స్ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మరో వైపు తాము ఓపీఎస్‌ను మాత్రమే కోరుతున్నామని, జీపీఎస్ కోసం ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తే ఇక తాము పాల్గొనబోమని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.