తాము క్రిప్టో కరెన్సీపై అంత సానుకూలంగా లేమన్నవిషయాన్ని తాము ముందే స్పష్టచేశామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ విషయంలో తాము ముందు నుంచి హెచ్చరిస్తూ వస్తున్నామని, ఇప్పుడు క్రిప్టో మార్కెట్‌కు ఏం జరిగిందో అందరూ చూస్తున్నారని ఆయన తెలిపారు. తాము ఇప్పటికే డిజిటల్ కరెన్సీలను అంటే క్రిప్టో కరెన్సీలను నియంత్రిస్తూ ఉంటే, ఇప్పుడు (క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ తర్వాత) ప్రజలు ప్రశ్నలను లేవనెత్తేవారని అభిప్రాయపడ్డారు. ఆయన ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా క్రిప్టో కరెన్సీల విషయంలో భారత్ ముందు నుంచి ఆంత సానుకూలముగా లేదు అని శక్తికాంత్ దాస్ మరోసారి స్పష్టంచేశారు. క్రిప్టో కరెన్సీల అంశంపై ఆర్‌బీ వైఖరి ఏంటో తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. తాము ఎప్పటి నుంచో క్రిప్టో కరెన్సీల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను అలర్ట్ చేస్తూనే వస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ పతనం అయ్యిందని వెల్లడించారు.
‘క్రిప్టో కరెన్సీలకు నిజమైన విలువ అంటూ ఏమీ లేదు. వీటిని ఎలా రెగ్యులేట్ చేయాలో తెలీదు. ఇది చాలా కష్టమైన పని. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. క్రిప్టో కరెన్సీ అనేది భారతదేశపు ద్రవ్య, ఆర్థిక, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని శక్తికాంత్ దాస్ వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీల విషయంలో తమ దారిలోనే నడుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. క్రిప్టోలపై తమ అభిప్రాయాలను ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామని పేర్కొన్నారు. అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డే కూడా క్రిప్టో కరెన్సీలపై ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తీకరించారు.
మరోవైపు మే 23న చాలా వరకు క్రిప్టో కరెన్సీలు లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటల్ 2.09 శాతం పెరుగుదలతో 1.29 ట్రిలియన్ డాలర్లకు ఎగసింది. అదేసమయంలో క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ గడిచిన 24 గంటల్లో 26.5 శాతం పెరుగుదలతో 61.27 బిలియన్ డాలర్లకు చేరింది. వరల్డ్ మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ధర రూ. 24.5 లక్షల వద్ద ఉంది. దీని మార్కెట్ వాటా 0.09 శాతం పెరుగుదలతో 44.60 శాతానికి చేరింది. మరోవైపు రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఇథీరియం కూడా పెరిగింది. దీని ధర 2.59 శాతం పెరుగుదలతో రూ.1.64 లక్షల వద్ద కదలాడుతోంది.