విశాఖ రుషికొండ తవ్వకాలపై ముందుకేవెళ్లాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక అడుగువేసింది. తవ్వకాలను ఆపాలని ఎన్జీటీ ఇచ్చిన స్టే పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం ఇచ్చిన స్టేను సర్కార్ సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే రుషికొండలో తవ్వకాలను చేపట్టినట్లు ప్రస్తావించింది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో పేర్కొంది. త్వరలో రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
గతేడాది నర్సాపురం ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 6న ఎన్జీటీ విచారణ జరిపింది. రుషికొండపై తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై నెల రోజుల్లో నివేదిక అందించాలని ఎన్జీటీ కమిటీని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ప్రభుత్వానికి చెప్పింది.
ఎంపీ రఘురామ గతేడాది ఎన్జీటీ చైర్మన్ ఆదర్శకుమార్ గోయల్‌కు లేఖ రాశారు. రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన జరుగుతోందని.. అక్కడ అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతున్నారని ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాదు రాష్ట్ర పర్యాటక శాఖ, పట్టణ మున్సిపల్ శాఖ అమలులో ఉన్న పర్యావరణ అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని లేఖలో ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎన్జీటీ ధర్మాసనం విచారణ జరిపి స్టే విధించింది.. అలాగే కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.