వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడనున్నదా...ఒకవేళ అదే జరిగితే ఏపీ రాష్ట్ర రాజకీయాలలో విమర్శల కాక మొదలు కానున్నదా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ ఎంపీగా ఉన్నా కూడా విమర్శలను పదునుపెడుతున్నా రఘురామకృష్ణరాజు ఇక ఆయనపై వేటు పడితే ఆయన మరింత రెచ్చిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలావుంటే ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ మరోసారి తెరపైకి వచ్చింది. రఘురామపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్పై లోక్సభ ప్రివిలేజ్ కమిటీ సోమవారం విచారణ నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ కమిటీ విచారణకు హాజరయ్యారు. భరత్ మౌఖికంగా సాక్ష్యం ఇచ్చేందుకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్కుమార్ సింగ్ అనర్హత పిటిషన్‌పై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అంటోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రఘురామపై పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి, విప్ మార్గాని భరత్ పలు ఆధారాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం స్పీకర్ కార్యాలయం నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ స్పీకర్‌ను కలిసి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదిలావుంటే రఘురామ కూడా దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలని వైఎస్సార్‌సీపీకి సవాల్ విసిరారు. నర్సాపురం ఉప ఎన్నికకు తాను సిద్ధమన్నారు. ఫిబ్రవరి వరకు డెడ్‌లైన్ కూడా విధించారు. ఆ తర్వాత అనర్హత వ్యవహారం పెద్దగా తెరపైకి రాలేదు. తాజాగా ప్రివిలేజ్ కమిటీ అనర్హత పిటిషన్‌పై విచారణ జరిపింది. మరి ఈ పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
రఘురామ 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇటు ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల తర్వాత రఘురామ సొంత పార్టీ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రెస్‌మీట్‌లు నిర్వహించి మరి టార్గెట్ చేసేవారు.
ఆ తర్వాత పుట్టిన రోజు నాడు రఘురామను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను పోలీసులు కొట్టారని ఆయన ఆరోపణలు చేశారు.. ఈ వ్యవహారం తర్వాత సుప్రీం కోర్టుకు చేరగా.. ఎంపీకి బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత కూా ఆయన మాత్రం దూకుడు తగ్గించలేదు.. రచ్చబండ పేరుతో ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని అంశాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు. ఇటు వైఎస్సార్‌సీపీ కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది.