అసోం ప్రజలు రెండు విధాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో సర్వంకోల్పోగా మరికొన్ని ప్రాంతాల్లో ఏనుగుల రూపంలో సమస్యను అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అసోంలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. ఆహారం వెతుక్కుంటూ ఊళ్లోకి చొరబడిన ఏనుగుల గుంపు ఓ ఇంట్లోకి ప్రవేశించి ముగ్గుర్ని చంపేసింది. లఖిపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గోపాలపురం ప్రాంతంలోకి 42 ఏనుగులు ప్రవేశించాయి. వాటిలో నుంచి ఓ గుంపు ఆహారం కోసం వెతుకుతూ ఊళ్లోకి చొరబడింది. ఈ క్రమంలో ఓ ఇంట్లోకి వెళ్లి.. ముగ్గురిపై దాడి చేసి చంపేశాయని లఖింపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధుర్బా దత్తా తెలిపారు.
అసోంలోనిక కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో రెండు వారాల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 38 ఏళ్ల మహిళను, ఆమె మూడేళ్ల కుమార్తెను ఏనుగులు తొక్కి చంపాయి. మే 9న తెల్లవారు జామున ఘరియల్‌దూబి ఏరియాలోని రమేశ్ ఓరాంగ్ ఇంటి ప్రాంగణంలోకి ఏనుగులు ప్రవేశించాయి. దీంతో కుక్కలు మొరగడంతో ఆయన భార్య తన మూడేళ్ల కూతుర్ని చంకలో వేసుకొని బయటకొచ్చింది.
బిడ్డతో సహా ఆమె ఇంట్లో నుంచి బయకు రాగానే.. తొండంతో వారిని ఈడ్చి పడేసిన ఏనుగులు నేల మీద పడేసి తొక్కాయి. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన రమేశ్ వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే అతడి భార్య చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. చికిత్స పొందుతూ చిన్నారి సైతం చనిపోయింది. మరోవైపు అసోంలో వరదల కారణంగా ఏనుగుల సహా జంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కపిలి నది వరదల్లో ఏనుగు కొట్టుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.