ఈరోజుల్లో డబ్బున్నోళ్లకంటే.. ఇమ్యూనిటీ ఉన్నవాళ్లే గొప్పవాళ్లు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఈ విషయంపై మరింత శ్రద్ధ పెట్టాలి. బాధ్యతలు నిర్వర్తించడమే కాదు. హెల్త్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. శారీరక, మానసిక సమస్యలకు దూరంగా ఉండాలి.
ఆరోగ్యం అనగానే ముందుగా గుర్తించుకోవాల్సింది.. మనం తినే ఆహారం. ఇప్పటికే ఈ విషయంలో చాలామంది అవగాహన పెరిగింది. నూనె పదార్థాలను తగ్గించి.. పోషకాహారాలు తీసుకోవాలి. పూరీ, దోసెల్లాంటి నూనె పదార్థాలకు బదులు నెలలో ఎక్కువ రోజులు ఇడ్లీ తినడం బెస్ట్. విసుగనిపించినప్పుడు మొలకెత్తిన గింజల్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే సరి.. భోజనవేళ వరకూ దండిగా ఉంటుంది. పోషకాలన్నీ అందుతాయి.
గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. మనం ఉద్రేకాలకు లోనైనా, ఆందోళన చెందినా ఆ ఒత్తిడి మెదడు, హృదయం మీద పడి హైపర్ టెన్షన్, గుండెపోటు వచ్చే అవకాశముంది. అందుకే ప్రశాంతత చాలా చాలా అవసరం. మనశ్శాంతిగా ఉండేందుకు ట్రై చేయాలి. ఎలాంటి మనస్తత్వాలూ పరిస్థితులనయినా అర్థం చేసుకుని సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి.
అలాగే ఉప్పు, పంచదార, మైదాపిండి.. ఈ మూడింటినీ ఆమడ దూరం పెట్టాలి. ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే పండ్లూ, కూరగాయలూ తినాలి. దీంతోపాటు తగినంత వ్యాయామం చేయాలి, అలసట తీరేలా నిద్రపోవాలి.
రోజంతా ఆడవాళ్లకు వంటా వార్పూ, ఉద్యోగ బాధ్యతలతోనే గడిచిపోతుంది, ఇంకెక్కడ తీరికా అనుకోకుండా రోజులో కనీసం గంటసేపు బొమ్మలు గీయడం, సంగీతం వంటి ఇష్టమైనవాటితో కొంతసేపు గడపాలి. అప్పుడు మానసిక ఆనందం సొంతమవుతుంది.