కరోనావైరస్ కు ధనిక, ఉన్నత, పేద, సామాన్యుడు, మతం, కులం, వర్ణం, ప్రాంతం ఇలాంటి తేడా ఏమీలేదని మనకు గత అనుభవాలు తెలియజేశాయి. కానీ ఉత్తర కొరియా దేశాధినేత తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దేశాధినేత అయినందుకు ఆయనకు మాస్క్ పెట్టుకోకపోయినా ఏం కాదు అన్నట్లు ఆ దేశ అధికార మీడియా ప్రవర్తించిన తీరు మరింత విమర్శలకు తావిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన కిమ్.. వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు మాత్రం అనుమతించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారి విజృంభించడంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలు కూలిపోతాయని, ఔషధాలకు కూడా తీవ్ర కొరత ఏర్పడిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత తమ దేశంలో కేసులు నమోదయినట్టు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహమ్మారితో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరవుతోంది. లక్షలాది మంది కోవిడ్-19 లక్షణాలైన జ్వరం వంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కనీసం మాస్క్‌కు కూడా లేకుండా ఓ సైనిక జనరల్ అంత్యక్రియల్లో పాల్గొనడం గమనార్హం. దానిని ఓ పెద్ద ఘనకార్యంలా అధికారిక మీడియా కేసీఎన్‌ఏ భారీ ప్రచారం చేసింది. కిమ్ తండ్రి మరణం తర్వాత అక్కడ జరిగిన అతిపెద్ద అంత్యక్రియల కార్యక్రమం ఇదే కావడం చెప్పుకోదగ్గ విషయం.
ఉత్తర కొరియా పీపుల్స్ ఆర్మీ అధికారి, కిమ్‌కు అత్యంత నమ్మకస్తుడైన మార్షల్ హయోన్ చాల్ హెయ్ మృతి చెందారు. తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్‌కు అధికారం దక్కేట్లు చేయడంలో ఈ సైనిక జనరల్ కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, 1950-53 మధ్య కిమ్ ఇల్ సంగ్‌కు వ్యక్తిగత సంరక్షకుడిగానూ పనిచేశారు.
ఇటీవలే అనారోగ్యానికి గురైన హయోన్‌కు పలు శరీర అవయవాలు పనిచేయకపోవడంతో మృతి చెందాడు. ఆదివారం నిర్వహించిన ఆయన అంత్యక్రియలకు హాజరైన కిమ్.. తన విశ్వాసపాత్రుడి భౌతికకాయం ఉంచి శవపేటికను స్వయంగా మోశారు. ఈ సమయంలో కిమ్ తప్పా మిగిలిన అధికారులు మాస్కులు ధరించారు. ప్యాంగ్‌యాంగ్ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ‘‘కిమ్ జోంగ్ ఇల్‌తో పాటు హయోన్ చోల్ హే పేరు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది’’ అని కిమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు కేసీఎన్‌ఏ తెలిపింది.
ప్రస్తుతం ఉత్తరకొరియాలో 2.8 మిలియన్ల మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. కరోనా మృతుల సంఖ్యను మాత్రం తెలియజేయలేదు. ఏప్రిల్ 25న జరిగిన సైనిక పరేడ్‌లో వేలాది మంది ప్రజలు మాస్కులు లేకుండా పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి కరోనా వ్యాప్తి వేగంగా పెరిగిపోయింది. సోమవారం అక్కడ కొత్తగా 1,67,650 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. గతవారంతో పోల్చితే కేసులు భారీగానే తగ్గినట్టు తెలిపింది.