చైనా దేశానికి కొత్త అధ్యక్షుడు రానున్నాడు అన్న ఊహగానాలకు బలంచేకూరేలా తాజా పరిణామాలు ఆదేశంలో కనిపిస్తున్నాయి. చైనా అధికార పార్టీ పత్రికల్లో సైతం కొన్నాళ్లుగా జిన్ పింగ్ ఫోటో కనుమరుగవుతోందని తెలుస్తోంది. దీంతో చైనా దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పాలనపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా ఇంకో కథనం బయటకొచ్చింది. కొన్నిరోజుల నుంచి పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ మొదటి పేజీల్లో జిన్‌పింగ్‌కు సంబంధించిన వార్తలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీపై ఆయన పట్టు కోల్పోతున్నారని, ప్రధాని లీ కీక్వాంగ్ పట్టు సాధిస్తున్నారని అక్కడి రాజకీయ నిపుణులు అంటున్నారు.
జిన్‌పింగ్ కోవిడ్ వైరస్, ఆర్థిక సంబంధిత విధానాలు పార్టీలోని ఉన్నతస్థాయి నాయకులకు నచ్చడం లేదని, పాలసీలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. జిన్‌పింగ్ వార్తలు పత్రికలో రాకపోవడానికి అదే కారణం కావొచ్చని సమాచారం. దీంతో పేపర్ మొదటి పేజీలో జిన్‌పింగ్ వార్తలు రాకపోవడంతో నాయకత్వ నిర్మాణంలో జరగబోయే మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నట్టు చైనా మీడియా అంటోంది.
అదే సమయంలో పేపర్‌లో లీ కీక్వాంగ్ వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏప్రిల్ 25న స్టేట్ కౌన్సిల్ ఐదో క్లీన్ గవర్నమెంట్ వర్క్ కాన్ఫరెన్స్‌లో ప్రీమియర్‌లో లీ కీక్వాంగ్ చేసిన ప్రసంగాన్ని పీపుల్స్ డైలీ రెండో పేజీలో పబ్లిష్ చేశారు. దీంతో అతని ఆలోచనలకు, రాజకీయాలకు ఆమోదం పెరుగుతుందనడానికి దీన్నే నిదర్శనంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జిన్‌పింగ్‌కు, లీ కీక్వాంగ్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే ఊహాగానాలు సాగుతున్నాయి.
ఏదిఏమైనా డ్రాగన్ కంట్రీలో జిన్‌పింగ్ ఛరీష్మా చెరిగిపోయిందని విస్తృతంగా ప్రచారం అయింది. ఈ మధ్య కాలంలోనే జిన్‌పింగ్ తన పదవి నుంచి తప్పుకోవచ్చని చైనా సోషల్ మీడియాలో రూమర్లు గుప్పుమన్నాయి. ప్రధానంగా దేశంలో కోవిడ్ వైరస్ కేసులను కట్టడి చేయడంలో జిన్‌పింగ్ విఫలమయ్యారని, దాంతో ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెనడా దేశానికి చెందిన ఓ బ్లాగర్ చేసిన వీడియో చైనాలో ట్రెండ్ అయింది. ఆ బ్లాగర్ జిన్‌పింగ్ అధ్యక్షుడుగా దిగిపోవడమే కాకుండా ఆయన స్థానంలో లీ కీక్వాంగ్ బాధ్యతలు చేపడతామని కూడా చెప్పారు. ఇక పార్టీని, ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతాడని కూడా పేర్కొన్నాడు.