పొరుగు దేశాలపై చైనా ఆగడాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశానికి వ్యతిరేకంగా అనేక దేశాలు గళం విప్పుతున్నాయి. తాజాగా చైనా దేశానికి చెక్ పెట్టేందుకు ప్రపంచంలోని 13 దేశాలు ఏకమయ్యాయి. చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా ఈ దేశాల సారథ్యంలో ఓ అంతర్జాతీయ కూటమి ఆవిర్భవించింది. ఆర్థికంగా, వాణిజ్య పరంగా డ్రాగన్‌ను నిలువరించేలా అమెరికా చొరవతో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, బ్రూనే సభ్యులుగా ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)’ కూటమి ఏర్పడింది. ఈ ఒప్పందంపై 13 దేశాలు సంతకం చేశాయి. ఇలా సంతకం చేసిన దేశాల జాబితాలో ఇందులో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణి కొరియా తదితర దేశాలున్నాయి. ఒప్పందంలో చేరిన ఈ 13 దేశాలకు ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటా ఉండడం గమనార్హం. టోక్యో వేదికగా సోమవారం జరిగిన కీలక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత్, జపాన్ ప్రధానులు నరేంద్ర మోదీ, ఫుమియో కిషిడా తదితర దేశాధినేతల సారథ్యంలో ఒప్పందం అమల్లోకి వచ్చింది.
అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, బ్రూనే తొలి విడత సభ్యులుగా చేరాయి. ఇండో-పసిఫిక్ ప్రాంత సానుకూల అభివృద్ధికి అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఎగుమతి-దిగుమతులు, పర్యావరణహిత ఇంధన రంగాలు, అవినీతి నిరోధక చర్యలకు సంబంధించి ఆసియా ఆర్థిక వ్యవస్థలతో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఐపీఈఎఫ్ సహకరిస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ కొత్త నిబంధనలు 21వ శతాబ్దపు ఆర్ధిక వ్యవస్థకు ఉపకరిస్తాయని, మరింత వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి చెందుతాయని బైడెన్ అన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇంజిన్‌గా మారాలని.. ఐపీఈఎఫ్ ఒప్పందానికి అభివృద్ధి, పరస్పర విశ్వాసం, పారదర్శకత పునాదులు కావాలని ఆకాంక్షించారు. ‘‘ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్ధిక కార్యకలాపాలు, తయారీకి ఇండో-పసిఫిక్ ప్రాంతం కేంద్రం.. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో కీలక వాణిజ్య కేంద్రంగా వెలుగొందిన చరిత్ర భారత్‌ది.. ప్రపంచంలోనే అత్యంత పురాతన రేపు పట్టణం లోథాల్ మా సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే ఉంది.. ఈ ప్రాంతంలో ఆర్ధిక సవాళ్లను అధిగమించడానికి సృజనాత్మక పరిష్కరాలను కనుగొంటాం’’ అని మోదీ అన్నారు.
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపాయని.. ఈ నేపథ్యంలో భవిష్యత్ కోసం మన ఆర్థిక వ్యవస్థలను సమష్టిగా సిద్ధం చేయడానికి ఐపీఈఎఫ్ ఉపకరిస్తుందని సభ్య దేశాలు ఓ సంయుక్త ప్రకటన వెలువరించాయి. అయితే ఈ ఒప్పందంలో పలు లోపాలు ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. సభ్య దేశాలకు టారీఫ్‌ల తగ్గింపు వంటి రాయితీలు, అమెరికా మార్కెట్లలో ప్రవేశానికి అధిక అవకాశాలు ఇందులో లేకపోవడం ప్రధాన సమస్యగా చెబుతున్నారు.
గతంలో అమెరికా నాయకత్వంలో విజయవంతంగా నడచిన ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యం (టీపీపీ) మాదిరిగా ఈ ఒప్పందం అంత ఆకర్షణీయంగా లేదని అంటున్నారు. ట్రంప్ హయాంలో టీపీపీ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. దాని స్థానంలో తాజా ఒప్పందాన్ని తీసుకొచ్చి, చైనా ఆర్థిక ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని బైడెన్ యంత్రాంగం చొరవ తీసుకుంది.