తాజాగా క్యాడ్ అంటే ఏమిటీ అన్న చర్చకు దారితీసింది. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వాన మేరకు టోక్యో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ క్వాడ్ సదస్సు లో పాల్గొన్నారు. క్వాడ్ దేశాల అధినేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అసలు క్వాడ్ అంటే ఏమిటి..? దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు..? ఈ కూటమి ఎలా ఏర్పాటైందోనన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో క్యాడ్ అంటే ఏమిటో ఓ సారి పరిశీలిద్దాం
అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత దేశాల కూటమినే క్వాడ్‌గా పిలుస్తున్నారు. 2004 చివర్లో వచ్చిన సునామీ కారణంగా హిందూ మహాసముద్ర తీర దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంత దేశాలకు మానవతా సాయం, విపత్తు సాయం అందించడం కోసం పైన పేర్కొన్న నాలుగు దేశాలు చేతులు కలిపాయి. జపాన్ ప్రధాని షింజో అబే 2007లో ఈ కూటమిని క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్)గా అభివర్ణించారు. మలబార్ విన్యాసాల పేరిట భారత్, అమెరికా చేపడుతున్న నౌకాదళ విన్యాసాల్లో మిగతా రెండు దేశాలు కూడా పాల్గొనడం అనేది క్వాడ్ ఉద్దేశం. కానీ ఈ గ్రూప్ చైనాను సవాల్ చేసేలా ఉందనే ఉద్దేశంతో ఏడాది తర్వాత ఆస్ట్రేలియా వెనక్కి తగ్గింది. చైనాతో ఆస్ట్రేలియాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉండటమే దీనికి కారణం.
కానీ హిందూ మహాసముద్రంలో చైనా దూకుడు పెరగడం.. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలోని నౌకా శక్తిని మోహరిస్తుండటం, మిగతా దేశాలను భయభ్రాంతులకు గురి చేసేలా ఆ దేశం తీరు ఉండటంతోపాటు.. భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆస్ట్రేలియా మనసు మార్చుకుంది.
2017లో క్వాడ్ గ్రూప్ తిరిగి యాక్టివ్ అయ్యింది. ఇండో-పసిఫిక్ రీజియన్‌పై ఫోకస్ పెట్టడంలో, ముఖ్యంగా చైనా దూకుడుకు కళ్లెం వేయడంలో క్వాడ్ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా అధినాయకత్వం భావిస్తోంది. 2021లో క్వాడ్ దేశాల అధినేతలు తొలిసారి భేటీ అయ్యారు. అదే ఏడాది మార్చి నెలలో మరోసారి వర్చువల్‌గా సమావేశం అయ్యారు.
పొరుగు దేశాలతో భౌగోళిక వివాదాలు ఉన్న చైనాకు ‘క్వాడ్’ కంట్లో నలుసులా మారింది. అందుకే ఈ గ్రూపు ఏర్పాటును డ్రాగన్ వ్యతిరేకిస్తోంది. పెరుగుతున్న తమ ప్రాబల్యా్న్ని అడ్డుకోవడం కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేశారని ఆ దేశం భావిస్తోంది. క్వాడ్‌ను ‘ఆసియా నాటో’గా అభివర్ణించింది. కానీ క్వాడ్ దేశాలు మాత్రం.. తమ గ్రూపు ఏ దేశానికీ వ్యతిరేకం కాదని.. ఆర్థిక, దౌత్య, సైనిక సంబంధాల బలోపేతం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నాయి. క్వాడ్ ఏర్పాటు వల్ల ఉద్రిక్తతలు పెరగడంతోపాటు, అంతర్జాతీయ సంఘీభావం, సహకారం దెబ్బతినే ప్రమాదం ఉందని చైనా విదేశాంగ మంత్రి హెచ్చరించారు.
స్వేచ్ఛాయుత, సుసంపన్నమైన, సంఘటిత ప్రాంతంగా ఇండో-పసిఫిక్ తీరాన్ని మార్చాలనేది క్వాడ్ ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. సముద్ర తీర ప్రాంత భద్రత, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం, వ్యాక్సిన్ దౌత్యం, వాతావరణ మార్పుల ముప్పును తగ్గించడం, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెంచేలా వాతావరణం క్రియేట్ చేయడం, టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచడం అనేవి క్వాడ్ ఉద్దేశాలు