మే 26వ తేదీ నుంచి జ్ఞానవాపి మసీదు వివాదంపై విచారణను ప్రారంభించనున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. కమిషన్ సర్వే నివేదికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోగా తెలియజేయాలని పేర్కొంది. వీడియో సర్వే నివేదిక, మసీదులో శివలింగం అంశంపై సోమవారం నాడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పును న్యాయమూర్తి ఎక్ విశ్వేష్ రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, మసీదులో ఉన్న శివలింగానికి పూజలు నిర్వహించేలా అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు కాగా... దీనిపై ముస్లిం వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో మే 26న ఈ అంశంపై విచారణ జరగనుంది.
హిందువుల వాదనలు, ముస్లింల అభ్యంతరాలను కోర్టు విననుంది. అలాగే జ్ఞానవాపి మసీదులో కమిషన్ చేపట్టిన సర్వే, నివేదికపై ఇరు వర్గాలు తమ అభ్యంతరాలు తెలపాలని, వారంలోగా నివేదికను సమర్పించాలని కోరింది.
మసీదు కమిటీ తరఫున వాదిస్తున్న లాయర్ అభయ్ నాథ్ యాదవ్ మాట్లాడుతూ... ‘‘కేసు మెయింటెనబుల్‌గా లేదని చెబుతున్న మా దరఖాస్తును ముందుగా విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశమని నేను కోర్టుకు వివరించాను... మా దరఖాస్తుతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చదివాను.. ప్రత్యర్థి న్యాయవాది మా దరఖాస్తుపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి మరిన్ని పత్రాలు, సమయం అవసరమని చెప్పారు.. అయితే మెయింటెనబిలిటీని ముందుగా నిర్ణయించాలని నేను కోరాను’’ అని వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో జిల్లా న్యాయస్థానం విచారణను చేపట్టింది. మసీదు ప్రాంగణంలో వీడియో సర్వేను వ్యతిరేకిస్తూ ముస్లిం ప్రతినిధులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక కోర్టు నుంచి జిల్లా కోర్టుకు కేసు బదిలీ చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. సీనియర్, అనుభవజ్ఞుడైన జడ్జ్‌తో విచారణ చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణను గురువారం (మే 26) నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఇరు పార్టీలూ వారం రోజుల్లోగా అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఆదేశించింది.