కర్ణాటకలోని కలబుర్గి జిల్లా వాడీ ప్రాంతంలో దారుణం జరిగింది. వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వాడీలోని భీమానగర్ కు చెందిన విజయ కాంబ్లే వేరే మతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇతర మతానికి చెందిన వ్యక్తి తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించడం పట్ల వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంబ్లేను హత్య చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కాంబ్లేను ఓ రైల్వే బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి చంపేశారు. రాళ్లు, ఇటుకలు సహా పలు ఆయుధాలతో తీవ్రంగా కొట్టడం వల్ల రక్తస్రావమై కాంబ్లే అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసు తీవ్రతను దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.