సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఇటీవల పాన్ కార్డ్ హోల్డర్లకు కొత్త రూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రూల్ నేటి నుంచి (మే 26న) అమలులోకి రానుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను చట్టంలోని 114బీ రూల్ ప్రకారం బ్యాంకులో ఒక రోజులో రూ.50 వేల కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డ్ వివరాలు వెల్లడించడం తప్పనిసరి అనే నిబంధన అమలులో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ నిబంధనలో యాన్యువల్ లిమిట్ కవర్ కాదు. దీంతో సీబీడీటీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. నేటి నుంచి భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి కొత్త రూల్ అమల్లోకి వస్తుంది. ఈ రూల్ ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్ డ్రా చేసినా, డిపాజిట్ చేసినా తన పాన్ నెంబర్ వెల్లడించాలి.
ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులే కాకుండా కో ఆపరేటీవ్ బ్యాంకుల్లో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ చేసినా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే పాన్ కార్డ్ లేని వారు తమ ఆధార్ నెంబర్ వెల్లడించాలి. ఒకే సారి రూ.20 లక్షల ట్రాన్సాక్షన్ చేసినా, వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల లావాదేవీలు జరిపినా ఈ రూల్ వర్తిస్తుంది.