అందాల తార శ్రీదేవి,బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ల గారాల పట్టి జాన్వీ కపూర్,జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవ్వబోతున్నదనే వార్త కొన్ని రోజులుగా చిత్ర సీమలో వినబడుతుంది. ఆ మధ్య హైద్రాబాద్లో జరిగిన ఒక ఈవెంటులో పాల్గొన్న బోనీకపూర్ ఈ విషయం పై స్పందించి ఈ వార్తలన్ని ఒత్తి పుకార్లే అని కొట్టిపారేశారు. అయితే, త్వరలోనే జాన్వీ టాలీవుడ్ లో నటించే అవకాశాలున్నాయని చెప్పి ఉత్కంఠను రేకెత్తించారు.
తాజాగా ఎన్టీఆర్ 30 వ సినిమా ప్రకటన జరిగిన విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ తో సినిమాపై అంచనాలను క్రియేట్ చెయ్యటంలో కొరటాల గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలచడానికి కావలసిన అన్ని విషయాలపై కొరటాల చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకోసం తన టెక్నికల్ టీం లో భారీ మార్పులు చేసిన కొరటాల ఈ సినిమాలో తారక్ సరసన నటించబోయే హీరోయిన్ పై మరింత శ్రద్ద తీసుకున్నాడట. ఎప్పటినుంచో వస్తున్న పుకార్లను నిజం చేస్తూ ఇంకా ఎన్టీఆర్ 30పై మరింత బజ్ ను తీసుకురావటానికి బాలీవుడ్ అందం జాన్వికపూర్ ను హీరోయిన్గా ఎంపిక చేసారని టాక్. ఈ విషయమై జాన్వీ కపూర్ ను, బోనీ కపూర్ ను ఒప్పించే పనిలో కొరటాల చాలా బిజీగా ఉన్నారట. మరి...కొరటాల ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయో చూడాలి.