సాధారణంగా 50 ఏళ్లు వచ్చిన స్త్రీ, పురుషులు ఎదుగుతున్న తమ పిల్లలకు పెళ్లి చేయాలని భావిస్తుంటారు. వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ వయసులో వారి ఆలోచనలు అలా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఓ మహిళ వైద్యులను ఆశ్చర్యపరిచేలా చేసింది. 50 ఏళ్ల వయసులో ఆ మహిళ గర్భం దాల్చింది. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల ఎగ్మోర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్‌లో 50 ఏళ్ల మహిళ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) ద్వారా కవలలకు జన్మనిచ్చింది. పెళ్లయి 25 ఏళ్లు గడిచినా రాధిక(50)కి అనే మహిళకు పిల్లలు కలగలేదు. దీంతో చికిత్స కోసం అనేక క్లినిక్‌లు, ఆసుపత్రులకు వెళ్లినా సంతానం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. అయితే ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతారని కొందరు చెప్పడంతో రూ.5 లక్షలు ఖర్చు చేసింది. ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని ప్రయత్నాలు ప్రారంభించారు. గర్భం దాల్చిన తర్వాత ఎనిమిదవ నెలలో ఆమె తీవ్రమైన కాలు వాపు, ఊపిరితిత్తులలో నిమ్ము చేరడంతో ఆందోళన చెందింది. కార్పొరేట్ ఆసుపత్రులలో చేరేందుకు డబ్బులు లేకపోవడంతో ఎగ్మోర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్‌లో చేరింది. ఆ తర్వాత ఆమెను ఐసీయూలో డాక్టర్లు చేర్చారు. ఆమెకు స్కానింగ్ తీయగా, గర్భంలో శిశువుల మెదడకు సరిగ్గా రక్తప్రస్తరణ లేదని వైద్యులు గమనించారు. గత నెలలో ఆపరేషన్ చేయడంతో రాధికకు కవలలు పుట్టారు. ఆ శిశువులను ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందించారు. నెల రోజుల చికిత్స తర్వాత తల్లి, ఇద్దరు శిశువులూ ఆరోగ్యంగా కోలుకున్నారు.