ఆ మహిళ గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పటికే పెళ్లైన వ్యక్తిని వివాహమాడింది. పెళ్లైన తర్వాత బుద్ధిగా ఉండకుండా భర్త చేస్తున్న పనులు చూసి విసిగి పోయింది. కొంత కాలానికి పెళ్లి కాని తన చెల్లెలిపై భర్త కన్ను పడిందని తెలుసుకుని పగతో రగిలిపోయింది. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి, భర్తను ఈ లోకంలో లేకుండా చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన వ్యాపారి హత్యను ఛేదించిన పోలీసులకు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
దేశరాజధాని ఢిల్లీలోని వికాస్ నగర్ ప్రాంతానికి చెందిన వీర్ బహదూర్ వర్మ(50)కు వస్త్ర దుకాణం ఉంది. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో రెండవ భార్య చంద్ర కళ(28)తో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబ వివాదాల నేపథ్యంలో అతడి మొదటి భార్య ఇద్దరు పిల్లలతో సహా వేరుగా ఉంటుంది. అయితే మే 18న వీర్ బహదూర్ వర్మ హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో ఇద్దరు భార్యలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరికి వారం రోజులు పాటు అన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. రెండవ భార్య చంద్రకళ హంతకురాలని తెలిసింది. వీర్ బహదూర్ వర్మ వస్త్రదుకాణంలో ఆమె పని చేసేది. అయితే ఓ రోజు చంద్రకళపై వీర్ బహదూర్ వర్మ అత్యాచారం చేశాడు.
చంద్రకళ కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టడంతో గొడవ పెద్దది కాకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత వీర్ బహదూర్ వర్మ నిజస్వరూపం తెలిసింది. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, అవి చాలదన్నట్లు వ్యభిచార గృహాలకు వెళ్లడం చూసి గొడవ పెట్టుకుంది. అయినా భర్త మారలేదు. ఇటీవల చంద్ర కళ చెల్లి వారి ఇంటికి వచ్చింది. ఆమెపై కన్నేసిన వీర్ బహదూర్ లొంగదీసుకోవాలని యత్నించాడు. ఇది గమనించిన చంద్రకళ సహనం నశించి పోయింది. కిరాయి హంతకుడికి డబ్బు ఇచ్చి, చంపేందుకు సుత్తి కూడా చేతికి అందించి భర్తను హత్య చేయించింది. విచారణలో వాస్తవాలు వెల్లడి కావడంతో పోలీసుల ముందు జరిగిందంతా చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేశారు.