సెక్స్ వర్కర్ల విషయంలో సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. స్వచ్ఛందంగా సెక్స్ వర్కర్లుగా ఉన్న వారి విషయంలో జోక్యం చేసుకోవద్దని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. వ్యభిచారం అనేది ఒక వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్ వర్కర్లకు అందరితో పాటు గౌరవం, సమాన రక్షణకు అర్హులని పేర్కొంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు ఆరు ఆదేశాలు జారీ చేసింది. స్వచ్ఛంద సెక్స్ వర్క్ చట్టవిరుద్ధం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వేశ్యాగృహాన్ని నడపడం మాత్రమే చట్టవిరుద్ధమని తెలిపింది. సెక్స్ వర్కర్లను అరెస్టు చేయడం, జరిమానాలు విధించడం, వారిపై వేధింపులకు పాల్పడడం, వ్యభిచార గృహాలపై దాడులు చేయడం తగదని పేర్కొంది.
కేవలం వ్యభిచార వృత్తిలో ఉన్నారనే కారణంతో సెక్స్ వర్కర్ నుంచి ఆమె బిడ్డను వేరు చేయరాదని సర్వోన్నత ధర్మాసనం తెలిపింది. అందరికీ లభించే గౌరవమర్యాదలు, రక్షణ వంటివి సెక్స్ వర్కర్లు, వారి పిల్లలకు వర్తిస్తాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఫిర్యాదు చేసిన సెక్స్ వర్కర్లపై వివక్ష చూపవద్దని పోలీసులకు సూచించింది. ముఖ్యంగా వారిపై లైంగిక నేరం జరిగినట్లయితే, చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన సెక్స్ వర్కర్లకు తక్షణ వైద్య-చట్టపరమైన సంరక్షణతో సహా ప్రతి సౌకర్యాన్ని అందించాలని పేర్కొంది.