ఏపీలో కోనసీమ జిల్లాకు మహనీయుడు అంబేద్కర్ పేరు పెడితే కొందరు అల్లర్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. గుడివాడలో నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. కొందరు కావాలనే అంబేద్కర్ మహనీయునిపై రాజకీయాలు చేస్తున్నారన్నారు. అంబేద్కర్ పేరును ఓ జిల్లాకు పెడితే విధ్వంసాలు సృష్టించారని, అలాంటి వారిని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాంటి వారికి దేశంలో ఉండే హక్కు లేదన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలని కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం కోరడం రాజ్యాంగ ప్రకారం ప్రొసీజర్ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం కూడా తెలియకుండా పవన్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై కనీస అవగాహన లేని వ్యక్తులంగా పార్టీలు పెట్టి, రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని పవన్‌ను విమర్శించారు. పిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే వ్యక్తిగా పవన్‌ను అభివర్ణించారు. ప్రాణనష్టం కలగకుండా ఉండేందుకే ప్రభుత్వం కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదని, కొందరి మాయలో యువకులు పడ్డారని అన్నారు.