గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.నేడు బీజేపీలో చేరనుండడంతో ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనను కొనియాడారు. ప్రజల కోసం బీజేపీతో కలిసి పనిచేస్తానని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపీ చేరుతుండడం గమనార్హం.”దేశ, రాష్ట్ర, ప్రజల, సామాజిక ప్రయోజనాల కోసం నేడు నేను ఓ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నాను. దేశానికి సేవ చేయడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నేను ఓ చిరు సైనికుడిలా పనిచేస్తాను” అని హార్దిక్ పటేల్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, గుజరాత్‌లో పటీదార్ ఉద్యమంలో పాల్గొన్న హార్దిక్ పటేల్ దేశ ప్రజలు, రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.అయితే, కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తన అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదంటూ ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా ఆయన బీజేపీలో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆ పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు అదే జరిగింది.