వర్షాలు వచ్చాయన్న ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. కోస్తాంధ్రలో ఎండ దంచికొడుతోంది. దీంతో ఈ ప్రాంతం నిప్పుల కొలిమిలా తయారవుతోంది. సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతపవనాలు.. పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు మీదుగా ముందుకు కదులుతున్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గలేదు సరికదా మూడు రోజుల నుంచి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పగటిపూట 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాత్రి 10 గంటలు దాటినా ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకుపైగా కొనసాగుతుండటం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది.
ముఖ్యంగా రాయలసీమ కంటే కోస్తాలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3.5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 4 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం 141 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక, బుధవారం అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో 44.49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కోస్తా అంతటా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలపైనే ఉన్నాయి. గత మూడు రోజులుగా కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. రాత్రి 10 గంటలు దాటినా భానుడి భగభగలు తగ్గడం లేదు. బుధవారం రాత్రి 10 గంటలకు పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో 36 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పల్నాడు జిల్లా అచ్చంపేటలో 36.17 డిగ్రీలు, నాదెండ్లలో 35.34 డిగ్రీలు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 35.98 డిగ్రీలు, గురజాలలో 34.98 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా 37 మండలాల్లో వడగాలులు, రెండుచోట్ల తీవ్ర వడగాలులు వీచినట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మొత్తం 426 మండలాల్లో ఉష్ణతాప ప్రభావం ఎక్కువగా ఉంది. అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంది.