దివ్యవాణి రాజీనామా వ్యవహారం ట్విస్ట్ లపై ట్విస్ట్ లు ఇస్తోంది. తాజాగా మారోసారి టీడీపీకి దివ్యవాణి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సినీ నటి దివ్యవాణి గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీపై కుల, మతం ఆధారంగా ఆమె విమర్శలు గుప్పించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఇదే మాటను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చెబుతానన్నారు. బాబు వద్దే క్లారిటీ తీసుకుందామనే ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లూ పార్టీ నుంచి బయటకు రాకుండా నిరీక్షించానని చెప్పారు. బుధవారం చంద్రబాబుతో మాట్లాడుదామని వెళ్లిన తాను గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడూ తనపై కక్ష సాధింపుకు పాల్పడలేదన్నారు. టీడీపీలో తనలా బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నారని ఆమె ఆరోపించారు. నన్ను పార్టీలో చేర్పించిన అంబిక కృష్ణ.. నన్నే కరివేపాకులా వాడుకున్నారు.. బయటకు వచ్చేయమని చాలాసార్లు సూచించారని దివ్యవాణి తెలిపారు. చంద్రబాబు నాయుడికి కళ్లు, ముక్కు, నోరులా ఉన్న టీడీ జనార్దన్ వల్ల ఎంత మంది నష్టపోయారో లెక్కలు బయటకు తీయండంటూ.. ఆయన వల్లే పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పారు.
టీడీపీలో చేరాక తాను కోరుకుండానే ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను పొందానని దివ్యవాణి తెలిపారు. దివ్యవాణి కుటుంబంలో ఎవరినైనా ఒక మాట అంటే తాను పట్టించుకోను గానీ చంద్రబాబును ఎవరైనా ఒక మాట అంటే అంతరంగంలో నుంచి మాట్లాడుతుందనే భావన తన గురించి టీడీపీలో ఉందన్నారు. హిందూ కుటుంబంలో పుట్టిన తాను తన బిడ్డ ఆరోగ్యం కోసం బైబిల్ చదవడం మొదలుపెట్టానని దివ్యవాణి తెలిపారు. సువార్త నిమిత్తం అనేక ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో చాలా మంది పేదరికంతో, సమస్యలతో అల్లాడిపోవడం చూశానన్నారు. ప్రజలకు చేరువగా పని చేయడానికి అధికారం కావాలని అర్థమైందన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీలో చేరానని దివ్యవాణి తెలిపారు.
‘‘ఒకప్పుడు ప్రతి దాంట్లో నాకు ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీ నేతలు.. ఒక ఏడాదిగా ఎందుకు ప్రాధాన్యం తగ్గించారో తెలియడం లేదు. ఏడాదిన్నర క్రితం రాష్ట్రంలో ఆలయాల విధ్వంసం జరుగుతున్న సమయంలో.. టీడీపీ నేతలతో నిర్వహించిన మీటింగ్‌లో చంద్రబాబు కులాలు, మతాల గురించి మాట్లాడారు. ప్రభుత్వం మత మార్పిడిలను ప్రోత్సహిస్తోంది అన్నట్టుగా మాట్లాడారు. మీటింగ్ అయిపోయాక ‘మీ భావన కరెక్ట్.. కానీ మీ భాష్యం సరికాదని’ చంద్రబాబు గారికి చెప్పాను. ఓసారి చంద్రబాబును కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పుడు నేను ఒంటరిగా పోరాడాను. క్రైస్తవులు బాధపడుతున్నారనే నిజమైన రిపోర్ట్‌ను ఆయనకు ఇవ్వాలని కోరాను. అప్పుడు నన్ను నొక్కేశారు.
లోకేశ్ బాబును సంప్రదించగా టీడీ జనార్ధన్ గారికి పాయింట్స్ పంపమని చెప్పారు. దీంతో నేను ఆయనకు వాయిస్ రికార్డింగ్ చేసి బైబిల్‌లో ఎక్కడా మత మార్పిడి లేదని.. 10-15 పాయింట్లతో మెసేజ్ పంపించాను. ఆ తర్వాతి నుంచి టీడీపీలో నా డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. కానీ ఈ విషయం తెలుసుకోవడానికి టైం పట్టింది. 40 ఏళ్ల టీడీపీ అని ఇటీవల తెలంగాణలో భేటీ జరిగింది. అప్పుడు కూడా నాకు ఐదు నిమిషాలు మాట్లాడే సమయం ఇవ్వలేదు. చంద్రబాబు దగ్గరకు నన్ను వెళ్లనీయడం లేదు. ప్రెస్ మీట్లకు అడుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఓ సందర్భంలో టీడీపీ ఆఫీసుకు వెళ్తుంటే.. మెయిన్ గేట్ దగ్గరున్న బాయ్ నన్ను లోపలికి వెళ్లనీయలేదు. టీడీ జనార్ధన్ అనే వ్యక్తిని ఓపెన్‌గా ప్రశ్నించినందుకు ఇంత నరకం చూపిస్తారా..? ఇంత అవమానిస్తారా...?’’ అని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.