వైసీపీ పార్టీకి ఈ మధ్య కాలంలో రెబల్స్ నేతల వ్యవహారం పెద్ద తలనొప్పి గా మారింది. తమపై సస్పెన్షన్ వేటుకు కారణాలు ఏమిటో స్పష్టం చేయాలని నిలదీయడం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. గతంలో ఇదే తరహాలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ లేవనెత్తగా తాజాగా ఇటీవల సస్పెన్షన్ కు గురైన వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బరాయుడు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుంటే నర్సాపురం వైఎస్సార్‌సీపీ రాజకీయం వేడెక్కింది.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీంతో తన సస్పెన్షన్ వేటుపై సుబ్బారాయుడు స్పందించారు.. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తనని సస్పెండ్ చేసినట్లు సమాచారం అందింది అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని.. 12ఏళ్ల వయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి పెరిగిందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి టీడీపీ లేదు కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరినట్లు చెప్పుకొచ్చారు.
2012 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన అది ఇండిపెండెంట్‌గా గెలిచినట్టే లెక్క అన్నారు కొత్తపల్లి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసినపుడు ఇప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వ్యతిరేఖంగా పని చేశారని, 2019 ఎన్నికల్లో ప్రసాద రాజును గెలిపించేందుకు చాలా కృషి చేశానన్నారు. ఏ పార్టీలో ఉన్నా క్రమశిక్షణగా పని చేశానని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం ఉన్నవారికి.. వైఎస్సార్‌సీపీ పెట్టినపుడు ఉన్న నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదన్నారు. అభివృద్ది కోసం ప్రశ్నిస్తున్నాను అన్నారు.
తన రాజకీయ జీవితంలో కొమ్ములు తిరిగిన ముఖ్యమంత్రులను చూసాను.. అభివృద్ధి కోసం ఎక్కడ రాజీ పడలేదన్నారు సుబ్బారాయుడు. నర్సాపురం అభివృద్ది తన తోనే సాధ్యం అయ్యిందని.. పార్టీ కేంద్రకార్యాలయం నుంచి తనను సస్పెండ్ చేస్తున్నట్టు ఇచ్చిన లెటర్‌పై ఎవరి సంతకం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఎక్కడ అన్యాయం చేశానో ఎమ్మెల్యే ప్రసాద రాజు చెప్పాలని డిమాండ్చేశారు. తనపై ఎవరు పిర్యాదు చేశారో చెప్పాలని.. వైఎస్సార్‌సీపీకి సాయం చేశాను తప్ప ద్రోహం చేయలేదన్నారు. క్రమ శిక్షణ సంఘం ఏం చూసి తనను సస్పెండ్ చేశారో చెప్పాలని.. క్రమ శిక్షణ సంఘం తనను ఎందుకు సంప్రదించలేదన్నారు.
పార్టీ నియమావళిలో తప్పు చేసిన వారి విషయం చర్చించే రూల్ ఉందా లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి. దున్న ఈనిందంటే దూడ నీ కట్టేయ్యమన్నట్టు క్రమ శిక్షణ సంఘం వ్యవహరించిందని.. తన ప్రతిష్ట దెబ్బతినే విధంగా వ్యవహరించారని.. ఎవరు తనపై పిర్యాదు చేశారో సాయంత్రంలోగా చెప్పాలన్నారు. తాను చేసిన తప్పును వివరిస్తూ లెటర్ హెడ్‌పై వివరిస్తూ ప్రకటన చేయాలన్నారు.
తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న వైఎస్సార్‌సీపీ.. ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు సుబ్బారాయుడు. ఆయన పార్టీకి వ్యతిరేకంగాగా మాట్లాడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి తాను ఎమ్మెల్యేగా పని చేశానని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి విజయం సాధిస్తానే ధీమాను వ్యక్తం చేశారు.