చాగలమర్రి మండలంలోని రాజోలి ఆనకట్టవద్ద నిర్మిస్తున్న జలాశయం సమీపంలో ముంపునకు గురవుతున్న ఇళ్ల వివరాలను సేకరిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి, డీఈ గోవిందరాజులు తెలిపారు. టీజీపీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజోలి జలాశయం కోసం గడసలూరు, నెమ్మలదిన్నె, చిన్నముడియం, బలపనగూడురు, ఉప్పలూరు గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. ఆయా గ్రామాల్లో 900 గృహాలను గుర్తించామని తెలిపారు. జలాశయం కోసం 9 వేల ఎకరాల భూసేకరణ చేశామన్నారు. ఇందులో వేల ఎకరాలు రైతు పట్టా భూములు, 2 వేల ఎకరాలు ప్రభుత్వ భూములుగా గుర్తించామని తెలిపారు. ముంపునకు గురయ్యే గ్రామాలకు పరిహారం చెల్లించేందుకు కుటుంబ సభ్యుల వివరాలు, గృహాలను గుర్తిస్తున్నామని తెలిపారు. అలాగే టీజీపీ ప్రధాన కాలువలో 8 చోట్ల 'సైడ్‌వాల్ దెబ్బతినడంతో మరమ్మతులు చేయడానికి రూ. 6 కోట్లతో ప్రతిపాదనలు చేశామని తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే మరమ్మతు పనులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో టీజీపీ ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.