కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. మినీ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కలబురిగిలోని 3 ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదానికి గురైన బస్సును ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించినట్లు కలబురిగి ఎస్పీ ఇషా పంత్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఏడు నుంచి 8 మంది మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో మాత్రం మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఉదయం 6:30 గంటలకు బీదర్ – శ్రీరంగపట్నం హైవేపై కమలాపుర సమీపంలో ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి గురైన బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.