కృష్ణా జిల్లా: బాపులపాడు మండలం అంపాపురం ప్లై ఒవర్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా దూసుకువచ్చి కల్వర్టుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ప్రమాదస్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఈ ప్రమాదంలో రోడ్ మానేపల్లి లక్ష్మణరావు (22) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి షేక్ బషిర్ (27) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలుస్తుంది. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయనగరం ఆశోక్ నగర్ నుంచి నలుగురు వ్యక్తులు స్నేహితుడి వివాహం నిమిత్తం విజయవాడ బయలుదేరి వస్తుండగా అంపాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని వీరవల్లి ఎస్. ఐ సుబ్రహ్మణ్యం చెబుతున్నారు.