ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎటువైపు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 12:02 PM

ఎంచక్కా సైకిల్‌ ఎక్కి తిరిగే నలుగురు ఎమ్మెల్యేలు ఫ్యాన్‌ కిందికి ఎందుకు వచ్చామా అని ఇప్పుడు ఫీలవుతున్నారట. స్థానిక వైసీపీ నేతల సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఉక్కపోతకు గురువుతున్నాము అని వారి సన్నిహితుల దగ్గర వాపోతున్నారట? తెలుగుదేశంలో గెలిచి, ఫ్యాన్‌ కింద సేద తీరుదామని వస్తే అసలు సమస్య ఇక్కడే మొదలైందని వారి బాధ. ఎమ్మెల్యేలుగా గెలిచి వచ్చాం కాబట్టి ఇక హవా అంతా మనదేనని అనుకుంటే, సీన్‌ రివర్స్‌ అయిందని తెగ కుమిలిపోతున్నారట. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? ఎందుకు అంతలా కుమిలిపోతున్నారు?


వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే. మద్దాలి గిరి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే. కరణం బలరామ్‌, చీరాల ఎమ్మెల్యే. వాసుపల్లి గణేష్‌కుమార్‌, విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే. ఇందాక మనం చెప్పుకున్నాం వారే వీరు. ఈ నలుగురు ఎమ్మెల్యేల గురించే. అసలు వైసీపీ లో ముందు నుంచి ఉన్న సమన్వయ కర్త , కార్యకర్తలు లతో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయట. ప్రజాబలంతో గెలిచిన తమకు పవర్‌ ఉన్నా ఫ్యాన్‌ కింద సేద తీరుదామంటే, స్విచ్ సరిగ్గా పని చేయడం లేదని ఫీలవుతున్నారట. 


టీడీపీలో గెలిచి అధికార పార్టీలోకి జంప్ చేసిన ఈ ఎమ్మెల్యేలు పరిస్థితి అధికార పార్టీలో అయోమయంగా, గందరగోళంగా తయారైందట గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ రాజీనామా చేయటంతోనే అందరిలో ఈ చర్చ పెరిగిపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే వాసుపల్లి వైసీపీ నుంచి గెలిచిన శాసనసభ్యులు కాదు. 2019లో టీడీపీ తరపున గెలిచి, ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో పైన తెలిపిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పొసగక పార్టీకి దూరమయ్యారు. అలా వాసుపల్లి గణేష్‌తో పాటు సైకిల్‌ దిగిన వారిలో మద్దాలి గిరి, కరణం బలరామ్, వల్లభనేని వంశీ ఉన్నారు. 


వాస్తవానికి, అధికార పార్టీ నుంచి ఏవో ప్రయోజనాలు ఆశించి ఈ నలుగురు వైసీపీకి దగ్గరయ్యారన్నది జగమెరిగిన సత్యం. అయితే అప్పటికే వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ నేతలతో ఈ ఎమ్మెల్యేలకు సహజంగానే పడటం లేదు అన్నది పచ్చి నిజం. అదీగాక, అధికార పార్టీలో నాయకులుగా చెలామణి అవుతున్న నేతలు చాలా ఎక్కువ మందే ఉన్నారు. పైగా గన్నవరం మినహా, విశాఖ సౌత్‌, చీరాల, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకే వైసీపీ తరుపున నియోజకవర్గాల సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. దీంతో వైసీపీలోని నేతలకు, వైసీపీకి దగ్గరైన టీడీపీ ఎమ్మెల్యేలకు పడటం లేదు. 


ఇలా ఈ నలుగురిలో అటో, ఇటో కాస్త కరణంకు తప్ప మిగిలిన ముగ్గురికి వైసీపీ స్థానిక నేతల నుంచి సెగలు ఎక్కువైపోతున్నాయట. ఈ సెగను తట్టుకోలేకే తాజాగా వాసుపల్లి గణేష్‌కుమార్‌ నియోజకవర్గం సమన్వయకర్తగా రాజీనామా చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గణేష్‌ను సమన్వయకర్తగా నియమించినా అప్పటికే ఆ హోదాలో ద్రోణంరాజు సుధాకర్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ఒక్క వాసుపల్లే కాకుండా, మిగిలిన ముగ్గురు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఇందాక చెప్పుకున్నట్టు నలుగురిలో కరణం పరిస్ధితే కాస్త మెరుగ్గా ఉందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. వల్లభనేని వంశీ పరిస్థితి అయితే మరీ ఘోరంగా, దారుణంగా తయారైందని ఆయన అనుచరులే వాపోతున్నారు. 


గన్నవరం నియోజకవర్గంలోని బలమైన దుట్టా రామచంద్రరావు వర్గం వంశీని గట్టిగా వ్యతిరేకిస్తోందట. అది ఎంతవరకు ముదిరిందంటే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసే పరిస్థితి వంశీకి దక్కతుందా దుట్టాకు దక్కుతుందా? అన్నంత ఆసక్తి కనిపిస్తోంది. ఒకవైపు దుట్టా రామచంద్రరావు 2024 లో వంశి టిక్కెట్ ఇస్తే సహకరించటం జరగదు అని మీడియా ముఖంగా తెలియజేశారు. ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి ఎవరికిస్తారు అనేది ఆసక్తి ఆసక్తికరంగా మారింది. ఎలాగూ టీడీపీ కి దూరమైన తమకే అధినేత టికెట్లు ఇస్తారన్న నమ్మకంతో ఉన్న ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం వైసీపీతో నే కొనసాగుతామని చెబుతున్నారు కానీ చివరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి! కానీ ఎవరి నమ్మకం వారిది ఏం జరుగుతుందో చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com